Today TrendingVishwam Newsతాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

రూ.100 కోసం యువకుడి హత్య! (Video)

రూ.100 కోసం యువకుడి హత్య!

  • భద్రాచలం లాడ్జిలో సిబ్బంది దాడి.. 25 ఏళ్ల శరత్ మృతి
  • రూ.600 అద్దెకు రూ.500 చెల్లిస్తానన్నందుకు ఘర్షణ?
  • సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు.. పోలీసుల దర్యాప్తు

విశ్వం న్యూస్, భద్రాచలం: కేవలం రూ.100 అద్దె తేడా ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది. గది అద్దె విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీయడంతో లాడ్జి సిబ్బంది దాడిలో తెల్లం శరత్ (25) అనే యువకుడు మృతి చెందాడు. రామాలయం సమీపంలోని శ్రీ సత్యసాయి రెసిడెన్సీ లాడ్జిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

రూ.600 అద్దె.. రూ.500 చెల్లిస్తామంటూ వివాదం

భద్రాచలంలో జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న శరత్ వద్దకు హైదరాబాద్ నుంచి అతని స్నేహితులు వచ్చారు. సోమవారం అర్ధరాత్రి వారంతా కలిసి శ్రీ సత్యసాయి రెసిడెన్సీ లాడ్జికి గది కోసం వెళ్లారు. గదికి రూ.600 అద్దె చెల్లించాలని లాడ్జి నిర్వాహకులు చెప్పగా, రూ.500 మాత్రమే ఇస్తామని యువకులు చెప్పినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఆధార్, రేషన్ కార్డు వివరాల విషయంలోనూ వివాదం జరిగినట్లు తెలుస్తోంది.

సిబ్బంది దాడిలో మృతి

వివాదం ముదరడంతో లాడ్జి యజమాని మణికంఠ అనే సిబ్బందిని పిలిచినట్లు సమాచారం. అక్కడికి వచ్చిన అతను శరత్‌పై పిడిగుద్దులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శరత్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతనితో వచ్చిన స్నేహితులపైనా దాడి జరిగినట్లు సమాచారం.

ప్రమాదంగా చిత్రీకరించే యత్నం? : దాడి అనంతరం స్పృహ కోల్పోయిన శరత్‌ను లాడ్జి నిర్వాహకులు స్కూటీపై భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిందంటూ ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే వైద్యులు పరీక్షించగా అప్పటికే శరత్ మృతి చెందినట్లు నిర్ధారించారు.

సీసీ కెమెరాల్లో కీలక ఆధారాలు

ఈ ఘటనకు సంబంధించిన దాడి దృశ్యాలు లాడ్జిలోని సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఘటనకు గల పూర్తి కారణాలు, బాధ్యుల పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *