Today TrendingVishwam Newsహైదరాబాద్

సొంత ఎమ్మెల్యే ఛార్జ్‌షీట్‌కు సీఎం సమాధానం చెప్పాలి!

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అవినీతి, కమీషన్ల దందా పెరిగిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ ఆరోపించారు. సొంత పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ప్రభుత్వ అవినీతికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కాదని, అధికార పార్టీ ఎమ్మెల్యేనే ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు సంధించారని అన్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రజలు, మీడియా ప్రతినిధులు, నెటిజన్లను ఉద్దేశించి విడుదల చేసిన వీడియో సందేశంలో డా. శ్రవణ్ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. “మిస్టర్ రేవంత్ రెడ్డి గారూ.. ఇది బీఆర్ఎస్ వేసిన ఛార్జ్‌షీట్ కాదు.. మీ సొంత పార్టీ ఎమ్మెల్యే మీపై వేసిన ఛార్జ్‌షీట్” అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లు పనులు చేయలేని పరిస్థితి ఏర్పడిందని, అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు.

ఒక సాధారణ రూ.5 లక్షల సిమెంట్ రోడ్డు నిర్మాణ బిల్లు మంజూరు కావాలంటే ఎం-బుక్ (M-Book) రికార్డింగ్ దశలోనే 10 నుంచి 20 శాతం వరకు కమీషన్లు డిమాండ్ చేస్తున్నారన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. అధికారులకు, మధ్యవర్తులకు కమీషన్లు చెల్లించడం, కాంట్రాక్టర్ల మార్జిన్ కలిపి చూస్తే ప్రజాధనంలో అసలు నిర్మాణ పనులకు ఖర్చయ్యేది సగం మాత్రమేనని ఆరోపించారు. రూ.5 లక్షల పనిలో రూ.2.5 లక్షల విలువైన పనులే జరుగుతున్నాయా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సుపరిపాలన (Good Governance) హామీ ఏమైందని డా. శ్రవణ్ నిలదీశారు. అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కమీషన్ల పాలన సాగిస్తోందని విమర్శించారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘ఆర్ఆర్ ట్యాక్స్’ ఆరోపణలను గుర్తుచేస్తూ, ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేనే కమీషన్ల వ్యవహారాన్ని బయటపెట్టారని అన్నారు. ఈ కమీషన్ల సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తోంది? ఎక్కడికి తరలిస్తున్నారు? ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కమీషన్ల దందా కారణంగా రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి పరిస్థితులు కొనసాగితే కొత్త పరిశ్రమలు రాకపోవడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయని హెచ్చరించారు.

హోం శాఖతో పాటు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిధిలోనే ఉన్నందున, ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై వెంటనే విచారణకు ఆదేశించాలని డా. శ్రవణ్ డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలు, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు పక్కనపెట్టి, అవినీతి ఆరోపణలపై పారదర్శక విచారణ జరిపించాలని కోరారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుని, కమీషన్ల వ్యవస్థకు ముగింపు పలకాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *