సిటీఓ పునర్వ్యవస్థీకరణతో మల్టీ జోన్-1 ఉద్యోగులకు తీవ్ర అన్యాయం

- పదోన్నతుల్లో అసమానతలు తొలగించాలని తెలంగాణ ప్రభుత్వానికి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వినతి
హైదరాబాద్, మే 8 (విశ్వం న్యూస్) : తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో సిటీఓ (Commercial Tax Officer) పోస్టును బహుళ జోనల్ కేడర్‌గా పునర్వ్యవస్థీకరించడం వల్ల మల్టీ జోన్-1 ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మరియు వాణిజ్య పన్నుల కమిషనర్‌కు సమగ్ర వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.
జి.ఓ.ఎం.ఎస్. నెం.209, తేదీ 04-08-2021 ద్వారా సిటీఓ పోస్టును మల్టీ జోనల్ కేడర్‌గా మార్చడం వల్ల పదోన్నతులలో తీవ్ర అసమానతలు నెలకొన్నాయని పేర్కొన్నారు. మల్టీ జోన్-1లో 39 పోస్టులు మాత్రమే ఉండగా, మల్టీ జోన్-2లో 114 పోస్టులు ఉన్నాయని, అయితే గత నాలుగేళ్లలో మల్టీ జోన్-2 నుండి 18 మంది సిటీఓలుగా పదోన్నతి పొందగా, మల్టీ జోన్-1 నుండి కేవలం నలుగురికే అవకాశం లభించిందని తెలిపారు. దీని వలన ఉద్యోగుల మధ్య 1:5 నిష్పత్తిలో తీవ్ర అసమానత ఏర్పడిందని విమర్శించారు.
గతంలో సిటీఓ పోస్టు రాష్ట్ర కేడర్‌లో ఉండటం వల్ల రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన డీసీటీఓలకు సమాన అవకాశాలు ఉండేవని, కానీ మల్టీ జోనల్ వ్యవస్థ అమలుతో ఆ సమానత్వం పూర్తిగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. ముఖ్యంగా సీనియర్ అధికారులు మల్టీ జోన్-2ను ఎంపిక చేసుకోవడంతో, మల్టీ జోన్-1లోని అధికారులు సీనియారిటీ జాబితాలో వెనుకబడిపోయారని తెలిపారు. ఫలితంగా గత నాలుగేళ్లలో మల్టీ జోన్-1 నుంచి ఒక్క సిటీఓ కూడా అసిస్టెంట్ కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్ స్థాయికి పదోన్నతి పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే సీసీటీ కార్యాలయానికి అనుబంధంగా ఉన్న డీసీటీఓ పోస్టులు అధికంగా ఉండటం కూడా మల్టీ జోన్-1 అధికారులపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు. ఈ పోస్టులను తిరిగి క్షేత్రస్థాయి సర్కిళ్లు, డివిజన్లకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018, 2020, 2023 సంవత్సరాల్లో జరిగిన శాఖ విస్తరణల్లో కొత్త సర్కిళ్లు, డివిజన్లు ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మాత్రమే కేటాయించారని ఆరోపించారు. జిల్లా ప్రాంతాల్లోనే వాస్తవ వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ అక్కడ పరిపాలనా బలోపేతం జరగలేదన్నారు. ఖమ్మం జిల్లాకు ప్రత్యేక డివిజన్ కార్యాలయం మంజూరు చేయాలని, అలాగే 4 వేలకుపైగా పన్ను చెల్లింపుదారులు ఉన్న జిల్లాల్లో కొత్త సర్కిళ్లు ఏర్పాటు చేయాలని కోరారు.
కాళేశ్వరం జోన్ పరిధిలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దాపల్లి, భూపాలపల్లి, ములుగు ప్రాంతాల పరిపాలన ప్రస్తుతం వేర్వేరు డివిజన్ల పరిధిలో కొనసాగుతోందని, దీనివల్ల సేవా సంబంధిత వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అందువల్ల మంచిర్యాల్ లేదా రామగుండంలో ప్రత్యేక సీటీ డివిజన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని మల్టీ జోన్-1 ఉద్యోగులకు న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజిటెడ్, నాన్ గజిటెడ్, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ డిమాండ్ చేశారు.