విద్యాశాఖ టెండర్లలో “సెంట్రలైజ్డ్ దోపిడి”.. చేనేత కుటుంబాల ఉపాధిపై దెబ్బ: దాసోజు శ్రవణ్

హైదరాబాద్, మే 7, (విశ్వం న్యూస్) : తెలంగాణ విద్యాశాఖలో అమలవుతున్న సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానం భారీ అవినీతి, కమిషన్ రాజకీయాలకు వేదికగా మారిందని BRS ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో జిల్లా స్థాయిలో, వివిధ రెసిడెన్షియల్ వెల్ఫేర్ సంస్థలు స్థానిక అవసరాలకు అనుగుణంగా టెండర్లు పిలిచి సరఫరాలు చేపట్టేవని, ఆ విధానంతో చిన్న వ్యాపారులు, చేనేత కార్మికులు, టైలర్లు, సూక్ష్మ పరిశ్రమలు ఉపాధి పొందేవని తెలిపారు.
కానీ ప్రస్తుతం ప్రభుత్వం మొత్తం వ్యవస్థను సెంట్రలైజ్ చేసి, కొద్దిమంది పెద్ద కంపెనీలకే అనుకూలంగా టెండర్ నిబంధనలు రూపొందించిందని విమర్శించారు. యూనిఫార్మ్ సరఫరాలకు రూ.250 కోట్ల టర్నోవర్, నోట్‌బుక్స్‌కు రూ.150 కోట్ల టర్నోవర్ వంటి అర్హతలు విధించడం వల్ల చిన్న వ్యాపారులు పూర్తిగా బయటపడుతున్నారని అన్నారు. సాల్వెన్సీ సర్టిఫికెట్లు, భారీ ఆర్థిక అర్హతలు కూడా చిన్న తయారీదారులకు అడ్డంకిగా మారాయని పేర్కొన్నారు.
“ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (PMU)” పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి, మొత్తం టెండరింగ్ ప్రక్రియను సీఎం కార్యాలయం ఆధీనంలో నడుపుతున్నారని ఆరోపించారు. ప్రశ్నించే అధికారులను పక్కనబెట్టి, నాన్-క్యాడర్ అధికారులతో వ్యవస్థ నడిపిస్తున్నారని విమర్శించారు.
ట్రాలీ బ్యాగులు, పీటీ డ్రెస్సులు, దుప్పట్లు వంటి వస్తువులకు డిజైన్ వివరాలు ముందుగా ఇవ్వకుండా టెండర్లు పిలవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అలాగే బేస్ ప్రైస్ ప్రకటించకుండా కంపెనీలకు ఇష్టం వచ్చిన ధరలు కోట్ చేసే అవకాశం కల్పించారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన GO Ms No.1 ప్రకారం ప్రభుత్వ శాఖలకు అవసరమైన క్లాత్ ఉత్పత్తులను TESCO నుంచే కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ, ఆ జీవోను పక్కనబెట్టి ప్రైవేట్ కంపెనీలకు టెండర్లు కట్టబెడుతున్నారని దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ఈ అంశంపై హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని తప్పుబట్టిందని గుర్తుచేశారు.
పేద విద్యార్థుల అవసరాల పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడి జరుగుతోందని, అదే సమయంలో 40 వేలకుపైగా చేనేత కుటుంబాల ఉపాధి ప్రమాదంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ టెండర్లను వెంటనే రద్దు చేసి, మొత్తం వ్యవస్థపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విజిలెన్స్ కమిషన్, కేంద్ర సంస్థలు, కోర్టులను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.