ఎల్‌నినోపై ప్రభుత్వ నిర్లక్ష్యం: దాసోజు

ఎల్‌నినోపై ప్రభుత్వ నిర్లక్ష్యం: దాసోజు

ఎల్‌నినోపై ప్రభుత్వ నిర్లక్ష్యం: దాసోజు

హైదరాబాద్, అక్టోబర్ 19: తెలంగాణలో కరువు, ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శించారు. సంక్షోభం మొదలైన ఆరు నెలల తర్వాత మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం ప్రజలను మభ్యపెట్టే చర్యగా అభివర్ణించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ ఉపసంఘం సభ్యులకు 23 ప్రశ్నలతో బహిరంగ లేఖ విడుదల చేశారు.

ఎల్‌నినో ముప్పుపై ఏప్రిల్‌లోనే హెచ్చరికలు వచ్చినప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పంటలు ఎండిపోతున్న తర్వాత కమిటీ ఏర్పాటు చేయడం కాలయాపన మాత్రమేనన్నారు. కమిటీకి నిధులు, నిర్దిష్ట గడువు లేకపోవడాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని వినియోగించుకునే అవకాశాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రాణహిత జలాలు వృథాగా దిగువకు వెళ్లాయని విమర్శించారు.

విద్యుత్ డిమాండ్ అంచనాల్లో వైఫల్యం, అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు, తాగునీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

ఎల్‌నినో సంక్షోభంపై చర్చించేందుకు శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని, రూ.20,000 కోట్ల అత్యవసర అనుబంధ బడ్జెట్ ప్రవేశపెట్టాలని కోరారు. కరువు నివారణ ఖర్చులు, నీటి వినియోగం, విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు, ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *