చెప్పుకోలేని
బూతులతో తిట్టారు..

- అందుకే సహనం కోల్పోయా.. దానం నాగేందర్ క్లారిటీ
హైదరాబాద్, ఆగస్టు 3 (విశ్వం న్యూస్) : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగాయి. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధంతో సమావేశాలు హాట్ హాట్‌గా సాగాయి. అయితే.. సభ తొమ్మిది రోజుల పాటు సాగింది ఒకలెక్క అయితే.. చివరి రోజున (ఆగస్టు 02న) జరిగింది మరో లెక్క. సభలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడగా.. ఆయన ఒక్కసారిగా సహనం కోల్పోయి.. బీఆర్ఎస్ సభ్యులపై తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు. సభా వేదికగా వారికి ధమ్కీలు కూడా ఇచ్చారు. అయితే.. దానం నాగేందర్ సభలో వాడిన పదజాలంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో పవిత్రంగా భావించే అసెంబ్లీలో అలాంటి భాషను వాడటం ఏమాత్రం సహించరానిదంటూ.. విపక్ష పార్టీల నేతలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలపై దానం నాగేందర్ వివరణ ఇచ్చారు. శనివారం రోజున (ఆగస్టు 3న) హైదరాబాద్ ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సభలో హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాడే అవకాశాన్ని తనకు కల్పించారని.. ఆ సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారని తెలిపారు.
అసభ్యకర పదాలతో.. బయటకు చెప్పుకోలేని బూతులతో దూషించారని దానం పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తనను టార్గెట్ చేశారని.. కించపరిచే విధంగా మాట్లాడటం వల్లే సహనం కోల్పోయానని చెప్పుకొచ్చారు. అయితే.. మైక్ ఆన్‌లో లేకపోవటంతో ఆ మాటలు బయటికి వినిపించలేదని.. తనవి మాత్రమే వినిపించాయని దానం నాగేందర్ వివరించారు.