టార్గెట్ బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలే

- కరీంనగర్ లో కదం తొక్కిన కాషాయ దళం
- ఆకట్టుకున్న కేరళ, తమిళనాడు కళాకారుల నృత్యాలు
- అసోం సీఎం హిమంత్‌బిశ్వశర్మ, బండి సంజయ్‌లపై పూలవర్షం
కరీంనగర్, మే 15 (విశ్వం న్యూస్) : సుభాష్‌నగర్ కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఆదివారం నిర్వహించిన హిందూ ఏక్తాయాత్ర సక్సెస్ అయ్యింది. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి పార్టీశ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో కరీంనగర్ కాషాయమయంగా మారింది. భారీ జెండాలను చేతబట్టుకొని జై శ్రీరాం.. జై హనుమాన్.. భారత్ మాతాకీ జై అంటూ నినదించడంతో నగర వీధులు మారుమోగాయి. కరీంనగర్ వైశ్యభవన్ నుంచి ప్రారంభమైన హిందూ ఏక్తాయాత్ర రాజీవ్‌చౌక్, టవర్‌సర్కిల్, పాతబజార్, కమాన్ సర్కిల్, బస్టాండ్, తెలంగాణచౌక్ మీదుగా తిరిగి వైశ్యభవన్‌కు చేరుకుంది. భారీ వాహనంపై ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేరళ వాయిద్య బృందం, తమిళనాడు కళాకారుల దేవత రూపంతో చేసిన నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఆదివారం 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనా పార్టీ అధినేత బండి సంజయ్‌కుమార్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్, వరంగల్ తదితర జిల్లాల నుంచి బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. సాయంత్రం ఏడు గంటలకు వైశ్యభవన్ వద్ద బండి సంజయ్‌కుమార్, అసోం సీఎం హిమంత్‌బిశ్వశర్మ ప్రసంగించిన అనంతరం యాత్రను ప్రారంభించగా రాత్రి 10 గంటల వరకు సాగింది. ఈ సందర్భంగా వైశ్యభవన్ వద్ద పార్టీశ్రేణులు హిమంత్‌బిశ్వశర్మకు, బండి సంజయ్‌కుమార్‌కు గదను బహూకరించి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అలాగే అభిమానులు వారిపై దారిపొడువునా పూల వర్షం కురిపించారు.

కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటా..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్
ఈ సందర్భంగా బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ సామాడిని అయినా తనను కరీంనగర్ ప్రజలు ఎంపీగా గెలిపించారు.. ఈ గడ్డ, ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, హిందువులకు సేవ చేసే అదృష్టం కలుగడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. దీంతో పార్టీశ్రేణులు హర్ష ధ్వనాలతో చప్పట్లు, ఈలలు వేశారు. హిందూ సమాజాన్ని సంఘటితం చేసేందుకు ఏక్తాయాత్ర నిర్వహిస్తున్నామని, ఎవరూ ఏమి మాట్లాడినా హిందూ సమాజాన్ని వాటిని తిప్పికొడుతుందని, హిందువుల కోసం తాను ఏడుసార్లు జైలుకు వెళ్లాలని, ఎట్టి పరిస్థితుల్లో హిందువులను కించపరిస్తే ఊరుకోబోమని సంజయ్ వాఖ్యానించారు.

కొండగట్టు హనుమాన్‌కీ జై..
ఏక్తాయాత్రకు ముఖ్యఅతిథిగా హాజరైన అస్సాం సీఎం హిమంత్‌బిశ్వశర్మ తెలుగులో భారత్ మాతాకీ జై… కొండగట్టు హనుమాన్ కీ జై… జై మోదీ అంటూ నినదించడం ఉత్సాహాన్ని నింపింది. హనుమంతుడిలా బండి సంజయ్ తెలంగాణాలో రామరాజ్యం కోసం కష్టపడుతున్నారని, తెలంగాణలో రామరాజ్యం రాబోతుందని బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటేనని ఆ రెండు పార్టీలు వీఆర్ఎస్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు అసోం సీఎం. ఐదునెలల్లో రజాకారుల రాజ్యం పోయి రామరాజ్యం రాబోతుందని చెబుతూ పార్టీశ్రేణుల్లో జోష్ నింపారు. ఐదునెలలు రేయింబవళ్ళు కష్టపడి రామరాజ్యం తేవాలని పిలుపునిస్తూ తన ప్రసంగాన్ని 20 నిమిషాల్లో ముగించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, పార్టీశ్రేణులు, విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
