బాలి, బాలీ.. అయ్యొ బాలి బాలీ!!

- కలిసి ఉంటే కుటుంబాలకు బలగమే.. మేమూ ఒప్పుకుంటాం! అయితే.. మూఢాచారం మొత్తం సమాజానికే బలహీనత అన్న సత్యాన్ని నువ్వు కూడా జర గుర్తించాలి వేణు వెల్దండి సారు!!
- నా పల్లె ప్రజలు కలిసి మెలిసి ఉండాలి. అయితే.. రుద్దబడిన గుడ్డి నమ్మకాల బంధనాలతో కానేకాదు!
హైదరాబాద్, మార్చి 31 (విశ్వం న్యూస్) : తెలంగాణ యాస తీయదనం, గ్రామీణ శ్రామిక సంస్కృతిలోని గొప్పతనం కాదనేదేముంది? వాటికి మేమూ సలాం చేస్తాం. అయితే.. వాటిని షుగర్ కోటింగ్ లాగా వాడుకుంటూ మూఢాచారపు విషగుళికలను నా ప్రజల చేత మింగిస్తానంటే ఎట్లా ఒప్పుకునేది? “పిండమును జేసి పితరుల తలపోసే” మూఢత్వాన్ని ఎండగట్టి, పెంట తినెడి కాకి పితరుడెట్లయితడు? అని 500 ఏళ్ల క్రితమే మనకు వివేకపు హితవు పలికిండు వేమన. పెద్దన్న వేమన్న అందించిన వివేచన ప్రజలందరికీ అవసరమేనాయె, వెలుగు చూపేదేనాయె! నా తెలంగాణ సమాజానికి ఆ వెలుగు అవసరం లేదంటావా వేణు వెల్దండి సారు???

నా పల్లె ప్రజలు కలిసి మెలిసి ఉండాలి. అయితే.. మూఢాచారపు బంధంతో కానేకాదు! నీ కల్పనాశక్తికి కాస్త పదును పెడితే.. వాస్తవ పరిస్థితుల్ని వాస్తవికంగా ఎదుర్కొనే క్రమంలో.. ఆ సినిమాలోని పాత్రలు ఐక్యత సాధించినట్టుగా చూపగలిగేవాడివి.
సామాన్య ప్రజల పట్ల ప్రేమ, సానుభూతి గల కళాకారులెవరికైనా.. నేడు సంస్కృతిలో భాగంగా కనబడే మూఢాచారాలు ప్రజలు స్వంతంగా అలవర్చుకున్నవి కానే కావని.. స్వార్ధపర మనువాద శక్తులు లేనిపోని భయాలు కల్పించి రుద్దినవేనని ఎవరికైనా సులభంగా అర్ధమవుతుంది.
వాటివల్ల ప్రజలకు నష్టమే తప్ప మేలు లేనేలేదనీ అర్ధమవుతుంది. అయితే.. ఆ బాదరబందీలేవీ పట్టించుకోకుండా, మూఢాచారాల వెంట నడవడం నేడు చాలా మందికి “ఆసాన్ కామ్” ఐపోయింది. తమరిదీ ఆ బాపతే అని తేల్చింది ఈ సినిమా. మనం తిరస్కరించాల్సిన మూఢాచారాన్ని.. ఇగో, గిదే మన తెలంగాణా సంస్కృతి అంటూ జబర్దస్తీతో రుద్దే ప్రయత్నమే తమరి సినిమాలో కనిపిస్తున్నది. ఉత్తరాది ఖాప్ పంచాయతులను, తెలంగాణలోని వీడీసి కమిటీల దురాగతాలను, పంచాయితీ తీర్మానాల పేరుతో పెత్తందారీ వర్గాలు పల్లె ప్రజల పై చెలాయించే జలుంనీ.. సోయి గల తెలంగాణా బిడ్డలందరూ అసహ్యించుకుంటున్నరు. ఈ సినిమాలో మాత్రం.. పంచాయితీ తీర్మానాలు సబబేనని, వాటిని అందరూ అనుసరించాలని, కుటుంబాలను వెలివేయడం కూడా ధర్మబద్ధమేననే ఎండోర్స్ మెంటు బాజాప్తాగా చూపెట్టారు.

సిరిసిల్లా – జగిత్యాల ప్రాంతం అన్నా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్నా.. తెలంగాణ బిడ్డలకి, తెలుగు ప్రజలందరికీ టక్కున యాదికొచ్చే పేరు అలిశెట్టి ప్రభాకర్! నిరుద్యోగం, ఆకలి, నాటి సమాజపు నిరాదరణ తనని జీవితాంతం బాధించినా.. నికరంగా ప్రగతిశీలత వైపే నిలబడ్డాడు ఆయన. తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులకు అద్దం పడుతూనే.. ఇగో.. ఈ అంశాలు మన ప్రగతికి అవరోధాలు.. వీటిని మనం మెల్లమెల్లగా వదిలించుకోవాలనే హితవు ఆయన రచనల్లో కనబడేది. “అందరూ రండి, చుక్కా చుక్కా కలిపి చైతన్యం టానిక్ తీసుకురండి. నేను డాక్టర్ని కాదన్నా.. మీలోని అజ్ఞానపు బీడు భూముల్ని దున్నాలని పరితపించే ట్రాక్టర్ని!”అని ఎలుగెత్తి చాటినోడు మన ప్రభాకరన్న. ఆజ్ దేఖేతో.. కహాసే కహా తక్ ఆ గయే హమ్? అదేమో.. ఓ 40 ఏళ్ల కిందటి.. పాత ముచ్చటయిపాయె. అప్పటినుండి మానేరునదిలో మస్తు నీరు పారింది. కాలం గిర్రున తిరిగింది. 2023 వచ్చేసరికి మనమేమో దృఢంగా అడుగులు వేస్తున్నాం. వెనక్కి మరింత వెనక్కి!

తెలంగాణ బిడ్డలు పొరపాటున కూడా జాగృతం కావద్దనే రీతిలో నేడు అన్ని వైపుల నుండి కుట్రలు నడుస్తున్నాయి. గద్దెనెక్కిన స్వరాష్ట్ర పాలకులేమో.. తెలంగాణ సంస్కృతి పేరుతో బోనాల పండుగను.. అందులో ‘రంగం చెప్పుడు’ ను అధికారికంగా నిర్వహిస్తూ.. అమానుష జోగిని వ్యవస్థకు ఆమోదముద్ర వేస్తున్నారు.

ఆ రంగం చెప్పే చెల్లెళ్లను ఏవో మహిమలు గల మనుషులుగా చూపుతున్న మీడియా.. అందరిలాగా గౌరవ జీవితం గడిపే హక్కును కోల్పోయి, జోగినిలుగా మారిన వారి వ్యధాభరిత జీవిత వాస్తవాలను, ప్రజలు అసహ్యించుకోవాల్సిన అన్యాయాలను.. కప్పిపుచ్చడానికి యధాశక్తి ప్రయత్నిస్తున్నది. ప్రజల అమాయకపు నమ్మకాలే పెట్టుబడిగా ఓట్ల రాజకీయం నెరపాలని చూస్తున్న రాజకీయ నాయకులేమో.. “ఇవ్వాల ఏం వారం.. రేపు ఏం వారం.. ఇవ్వాల ఏ దేవున్ని పూజిస్తం.. రేపు ఏ దేవునికి మొక్కుతం.. నేటి యువత శ్రద్ధ పెట్టాల్సిన అంశాలివే” అనే రీతిలో.. జనాలని అపసవ్య దిశ వైపు తోస్తున్నారు. ఇగ ఇప్పడు అదనంగా.. ఇసోంటి ‘కళాఖండాలు’ మోపయినయ్!!
ప్రజల్లో ఉన్న మూఢ నమ్మకాలని సమర్థించేదిగా, పెంచి పోషించేదిగా ఉంటే.. ఇక తమరి ఈ సినిమాతో నా తెలంగాణా సమాజానికి ఏమి ఫాయిదా వేణు తమ్మీ? “కదిలేది కదిలించేది.. మునుముందుకు నడిపించేది.. పెనునిద్దుర వదిలించేదీ” తమరి లాంటి సినీ బేహారుల నుండి వస్తుందని ఆశించడం అత్యాశే నంటావా, బలరామ నరసయో..!? బాలి, బాలీ.. అయ్యొ బాలి బాలీ!!
ఆర్. రాజేశం
(కన్వీనర్-సామాజిక న్యాయ వేదిక)
