కమిషనర్‌కే రక్షణ లేకుంటే… సామాన్యుల భద్రత ఎక్కడ?

కమిషనర్‌కే రక్షణ లేకుంటే… సామాన్యుల భద్రత ఎక్కడ?

హైదరాబాద్, మే 6, (విశ్వం న్యూస్): నగర శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి నిర్వహించిన అర్ధరాత్రి డెకాయ్ ఆపరేషన్‌లో వెలుగుచూసిన ఘటనలు రాష్ట్రంలో భద్రతా వ్యవస్థ వైఫల్యాన్ని బహిర్గతం చేశాయని అన్నారు.

ఒక ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారిణికే నగర నడిబొడ్డున వేధింపులు ఎదురవడం ఆందోళనకరమని, మహిళల భద్రత పూర్తిగా దెబ్బతిన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ చెప్పిన మహిళల భద్రతపై ఆదర్శం ఈ ప్రభుత్వంలో కనుమరుగైందని విమర్శించారు.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలను ప్రస్తావిస్తూ, హైదరాబాద్‌లో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా వేధింపుల కేసులు అధికమవుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ‘ఫ్యూచర్ రెడీ’ అంటూ ప్రచారం చేయడం హాస్యాస్పదమని మండిపడ్డారు.

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రజల భద్రత కోసం కాకుండా రాజకీయ అవసరాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. అత్యాధునిక నిఘా వ్యవస్థ ఉన్నా, నడిరోడ్డుపై జరిగిన ఘటనలను గుర్తించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.

పోలీసులను ప్రతిపక్షాల అణచివేతకు వినియోగించడం వల్లే శాంతిభద్రతలు దెబ్బతింటున్నాయని, షీ టీమ్స్, పెట్రోలింగ్ వ్యవస్థలు సరిగా పనిచేయడం లేదని విమర్శించారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే ప్రజల భద్రతపై దృష్టి సారించాలని, హైదరాబాద్‌ను నేరగాళ్ల అడ్డాగా మారనివ్వకూడదని డాక్టర్ శ్రవణ్ దాసోజు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *