జై భీమ్

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విశ్వం న్యూస్) : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని 125 అడుగుల విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ గారి ప్రసంగం ముఖ్యాంశాలు :

• అంబేద్కర్ విశ్వమానవుడు.
• ఆయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం విశ్వజనీనమైనటువంటిది..సార్వజనీనమైనటువంటింది.
• ఒక ఊరికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో పరిమితమైంది కాదు.
• ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అణగారిన జాతులకు ఒక ఆశాదీపం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్.
• ఈరోజు ఆయన రచించిన రాజ్యాంగం 75 సంవత్సరాలు దాటిపోతావుంది. అంబేద్కర్ జయంతులు చేసుకుంటూ పోవడమేనా? ఆయన చెప్పింది ఏమైనా ఆచరించేది ఉందా? ఆ దిశగా ఏమన్నా కార్యాచరణ ఉందా, లేదా? అని మనందరం గుండెలమీద చెయ్యేసుకొని ఆలోచించుకోవాలి.
• ఇది భారతదేశం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.
• ఇంకా ఆటలు, పాటలే కాదు.. కార్యాచరణ ప్రారంభం కావాలి. ఒక ఆచరణాత్మకమైనటువంటి ప్రారంభోత్సవం కావాలి.
• అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎవరో డిమాండ్ చేస్తేనో, చెబితేనో ఏర్పాటు చేసుకోలేదు.
• అద్భుతమైనటువంటి విశ్వమానవుని విశ్వరూపాన్ని, ఈ మూర్తి రూపాన్ని మనమిక్కడ ప్రతిష్టించుకున్నామంటే దానిలో ఒక బలమైన సందేశం ఉంది.
• ఇది ఉన్నటువంటి ప్రదేశం ఒక సుందర దృశ్యమే కాకుండా రాష్ట్ర పరిపాలనా సౌధమైనటువంటి సెక్రటేరియట్ పక్కనే ఉంది. మన పరిపాలనా సౌధానికి కూడా అంబేద్కర్ గారి పేరే పెట్టుకున్నాం.
• సెక్రటేరియట్ ముందే అమరుల స్మారకం కూడా ఉంది. అ పక్కనే హుస్సేస్ సాగర్ మధ్యలో అంబేద్కర్ గారు నమ్మిన బుద్ధ విగ్రహం ఉంది.
• ఇవన్నీ ఒక అద్భుతమైనటువంటి సందేశాత్మకమైనటువంటి చిహ్నాలు.
• అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం, శాంతిమూర్తి బుద్ధుడిని ప్రతిరోజూ సెక్రటేరియట్ కు వచ్చే ముఖ్యమంత్రి, మంత్రులు, సెక్రటరీలకు ఎప్పటికప్పుడు అంబేద్కర్ గారి సిద్ధాంతం ఆలోచనల్లోకి వస్తూ ఉండాలె. అంబేద్కర్ గారిని చూస్తూ వాళ్ల మనసు ప్రభావితం కావాలె.
• ఆయన మార్గం పట్టాలని, ఆయన అనునిత్యం కలలో మెరవాలని, తమ జీవితాలను అర్పించి సాధించిన తెలంగాణ అమరులు ఆదర్శం కావాలనే విధంగా మనం రూపకల్పన చేసుకోవడం జరిగింది.
• ఇది విగ్రహం కాదు.. ఒక విప్లవం. ఇది కేవలం ఆకారానికి ప్రతీక కాదు, తెలంగాణ కలల సాకారానికి ఒక చైతన్య దీపిక అని మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. ఆ పద్ధతిలో దీనిని మనం ఆవిష్కరించుకోవడం జరిగింది.
• ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆహోరాత్రులు కృషి చేసినటువంటి ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, అంతకుముందు ప్రారంభంలో ప్రయత్నించిన కడియం శ్రీహరి, దానికి కొనసాగింపుగా కొప్పుల ఈశ్వర్ దేశదేశాలు తిరిగి కృషి చేశారు. దీని నిర్మాణం విషయంలో నిద్రాహారాలు లేకుండా కృషి చేసిన ఆర్ అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఈఎన్సీ గణపతి రెడ్డి, ఆర్ అండ్ బి సిబ్బంది, నిర్మాణ వ్యవస్థ, సిబ్బంది.. ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్జ్ఞతలు తెలియజేస్తున్నాను.
• డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఒక శాశ్వతమైనటువంటి అవార్డును ఇవ్వాలని దళిత మేధావి కత్తి పద్మారావు పత్రికా ముఖంగా ఒక సూచన చేశారు.
• తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ గారి పేరిట ఒక అవార్డును ఇవ్వనున్నట్లు తక్షణమే ప్రకటిస్తున్నాను. వెంటనే ఆదేశాలు ఇస్తాం.
• రూ.51 కోట్లను డిపాజిట్ చేసి, దాని ద్వారా వచ్చిన వడ్డీ దాదాపు రూ.3 కోట్లతో దేశంలో, రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించినవారికి అంబేద్కర్ గారి పేరిట ప్రతి జయంతి రోజు అవార్డులను అందివ్వడం జరుగుతుంది.

• 70 ఎండ్ల క్రితం రాజ్యాంగం అమలు ప్రారంభమై, అనేక పార్టీలు గెలవడం, ఓడటం, ప్రభుత్వాలు మార్పు జరిగినా.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేటివరకూ నిరుపేదలు ఎవరంటే దళితులు అనే మాట ఉండటం మనందరికి కూడా సిగ్గుచేటు. ఈ పరిస్థితి మారాలి.
• పార్టీలు ఓడిపోవటం, వేరే పార్టీలు గెలవడం కాదు. ఈ దేశంలో ప్రజలు గెలిచేటటువంటి రాజకీయం రావాలి. దానికోసం దళిత మేధావి వర్గం కూడా ఆలోచన చేయాలి.
• అన్నం ఉడికిందా? లేదా? అని కుండ మొత్తం చూడాల్సిన పనిలేదు. రెండు మూడు మెతుకులు చూస్తే చాలు. ఎవరి వైఖరి ఏ విధంగా ఉంది.. ఏ డైరెక్షన్ లో పనిచేస్తా ఉన్నరు.. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవిధంగా పనిచేస్తా ఉన్నదో ఆలోచించాలి.
• టీఆర్ఎస్ పార్టీ రావడానికి ముందు ఇక్కడ పది సంవత్సరాలు వేరే పార్టీ రాజ్యం చేసింది. వాళ్ల పది సంవత్సరాల కాలంలో దళితుల అభివృద్ధి కోసం వాళ్లు పెట్టిన ఖర్చు కేవలం రూ.16వేల కోట్ల రూపాయలు.
• టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింతర్వాత ఈ పది సంవత్సరాలలో దళితుల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన మొత్తం రూ.1,25,062 కోట్లు. ఇవి కాగ్ నిర్ధారించిన విషయాలే.
• భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప పనిని సాధించే కార్యక్రమం, దళితుల అభివృద్ధికి దోహదపడే కార్యక్రమం దళిత బంధు కూడా తెలంగాణ ప్రభుత్వం తెచ్చింది.
• రాష్ట్ర ప్రధాన కార్యాలయం సచివాలయానికే డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం. ఈనెల 30న ప్రారంభం చేసుకోబోతున్నాం.
• వీటన్నింటినీ మించి శిఖరాయమానంగా ఆకాశమంత ఎత్తు ఉండేటటువంటి, మనందరికి మార్గదర్శనం చేసేటటువంటి ప్రపంచంలోనే కాదు..ఇండియాలోనే కాదు..ఎక్కడ కూడా లేనంత ఎత్తైనటువంటి మహోన్నత విగ్రహంను ప్రతిష్టించుకున్న ఘనత కూడా మన తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని మనవి చేస్తా ఉన్న.
• అనేక పార్టీలు కొలాహలాలు, గందరగోళాలు చేస్త ఉంటారు. కానీ వాస్తవ దృక్పథం వైపు ప్రయాణం దళిత బిడ్డలందరూ కొనసాగించే విధంగా దళిత మేధావి వర్గం ఆలోచించాలె. అందుకు సమాయత్తం కావాలని కూడా నేను మనవి చేస్తున్నా.
• నిజంగా పనిచేసేవాళ్లను ప్రోత్సహిస్తూ ముందుకు మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉంటది.
• కొన్ని విషయాలు చెప్పడానికి ఆత్మ విశ్వాసం కావాలి. గతంలో నేను చెప్పిన. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీ వెళ్తా ఉన్నా.. మళ్లీ తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతా అని చెప్పి పోయిన. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసై, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే నేను తెలంగాణకు తిరిగి రావడం జరిగింది.
• మీ ముఖ్యమంత్రి ఇక్కడ చాలా కార్యక్రమాలు చేశారు. ఆయన జాతీయ రాజకీయాల్లో కూడా ఇదేరకమైన కార్యక్రమాలు చేయడానికి పార్టీని జాతీయస్థాయిలో విస్తరించారు.. మీ అందరి ఆశీస్సులు మీ ముఖ్యమంత్రి గారికి ఉండాలని ప్రకాష్ అంబేద్కర్ గారు చెప్పారు.
• వచ్చే 2024 పార్లమెంటు ఎన్నికలల్లో రాబోయే రాజ్యం మనదే..మనదే..మనదే ఈ భారత దేశంలో అని నేను మనవి చేస్తున్నా.
• మన శత్రువులకు మింగుడు పడకపోవచ్చు. కానీ చిన్న మిణుగురు చాలు అంటుకోవాడానికి.
• మహారాష్ట్రకు పోతే నేను కలలో కూడా అనుకోనటువంటి, ఊహించనటువంటి ప్రోత్సాహం, ఆదరణ అక్కడ వస్తా ఉంది.
• ఈరోజు మహారాష్ట్రలో వస్తున్నటువంటి ప్రజాదరణ, ప్రోత్సాహం..రేపు ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్.. ప్రతీచోట కూడా వస్తది.
• ఖచ్చితంగా భారత దేశంలో మన పాలన వస్తుంది.
• రేపటిరోజున తెలంగాణ దళిత బంధు దేశంలో మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఖచ్చితంగా ప్రతి సంవత్సరం 25 లక్షల దళిత కుటుంబాలకు అమలు చేస్తాం. అన్ని రాష్ట్రాల వారికి కూడా ఈ సదుపాయం అందుతుందని మనవి చేస్తా ఉన్నాను.

• అంబేద్కర్ గారి కలలు ఇంకా నెరవేరలేదు. నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వారి కలలు సాకారం కావాలె. ఆయన అనుకున్నటువంటి ఎన్నో విషయాలు సాకారమయ్యాయి.
• ఏదో ఒక ఒరవడిలో కొట్టుకొనిపోవడం కాకుండా, ఒక గాల్లో పోవడం కాకుండా ఎవరైతే నిర్ద్వందంగా నిజమైన శ్రద్ధతోని పేద ప్రజలను ఆశీర్వదించేవిధంగా పోతున్నరో వారికే మీ బలం అందాలె. మనం చీలిపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటది. కలిసికట్టుగా ముందుకుపోతే విజయం మనదే.
• మన రాష్ట్రంలో ఇప్పుడు 50 వేల మందికి దళిత బంధు సదుపాయం అందింది.
• ఈ ఆర్థిక సంవత్సరంలో మరో లక్షా పాతిక వేల మందికి ఈ సదుపాయం అందబోతున్నది. దీనిని బ్రహ్మండంగా సద్వినియోగం చేయాలని నాయకులు, అధికారులందరినీ కోరుతున్నాను.
• దేశంలోనే ఎక్కడాలేనటువంటి అద్భుతమైన ఆదర్శమూర్తి విగ్రహాన్ని గొప్పగా తీర్చిదిద్దుకున్నందుకు గర్వంగా ఉంది. ఈ సమయంలో ఈ అవకాశం నాకే కలిసి వచ్చినందుకు నా జన్మ ధన్యమైందని నేను మనవి చేస్తా ఉన్నా.
• రాబోయే రోజుల్లో కూడా బాబాసాహెబ్ బాటలో తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశాన్ని కూడా సరైన మార్గంలో పెట్టడానికి చివరి రక్తపుబొట్టు వరకు పోరాటం చేయడం జరుగుతది. ఎక్కడకూడా రాజీపడే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాను.

- అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరొక్కసారి జై భీమ్ తెలియజేస్తున్నాను.
