సర్వే ల్యాండ్ ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి

సర్వే ల్యాండ్ ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి

హైదరాబాద్, జూన్ 11 (విశ్వం న్యూస్) : భూమి కొలతల (సర్వే ల్యాండ్) శాఖలో పనిచేస్తున్న సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గెజిటెడ్, నాన్ గెజిటెడ్, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావులకు లేఖలు రాసినట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత సర్వే ల్యాండ్ శాఖలో పనిభారం గణనీయంగా పెరిగిందని, అయినప్పటికీ శాఖలోని అనేక డిప్యూటీ సర్వేయర్ పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో పలువురు అధికారులు ఒకేసారి రెండు, మూడు మండలాల బాధ్యతలను నిర్వహించాల్సి వస్తోందని అన్నారు.

శాఖలో పనిచేస్తున్న సర్వేయర్లు ఎన్నో సంవత్సరాలుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారని, వారి సీనియారిటీ, రోస్టర్ పాయింట్లు, ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను పరిగణనలోకి తీసుకుని ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కొత్త జిల్లాలు ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రమోషన్ల ప్రక్రియ ముందుకు సాగకపోవడం ఉద్యోగుల్లో నిరాశను కలిగిస్తోందని చెప్పారు.

ఎండా, వానా తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా భూముల సర్వేలు నిర్వహిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సర్వే ల్యాండ్ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలను గుర్తించి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. అలాగే శాఖలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *