సీనియర్ దళిత జర్నలిస్ట్ నిరంజన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
సీనియర్ దళిత జర్నలిస్ట్ నిరంజన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

- నిరంజన్ కు రూ.20 లక్షల
ఆర్థిక సహాయం అందించాలి - అతని కుటుంబాన్ని పరామర్శించడంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధుల వివక్ష
- ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల
రాష్ట్ర అధ్యక్షులు కట్కూరి మల్లేష్ డిమాండ్
పెద్దపల్లి, మార్చి 18 (విశ్వం న్యూస్) : ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ దళిత జర్నలిస్ట్ జనగామ నిరంజన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కట్కూరి మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పెద్దపెల్లి జిల్లా కేంద్రం లో నివాసం ఉంటున్న జనగామ నిరంజన్ కుటుంబాన్ని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో పరామర్శించారు. జనగామ నిరంజన్ మృతి చెందడానికి కారణాలను, కుటుంబ ఆర్థిక పరిస్థితులను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. జనగామ నిరంజన్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కట్కూరి మల్లేష్ మాట్లాడుతూ జనగామ నిరంజన్ పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో గత 30 సంవత్సరాలుగా సిటీ కేబుల్ ఛానల్ విలేకరిగా పనిచేశారని, ఆయన రాసిన వార్తల తో అనేకమంది వ్యక్తులు కిందిస్థాయి నుండి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా, మంత్రులుగా ఎదిగారని తెలిపారు. జనగామ నిరంజన్ వృత్తిరీత్యా జర్నలిస్టుగా అనేక సేవలు అందించడంతోపాటు నిజాయితీగా నిబద్దతో గడిపారని తెలిపారు.ఆయన మృతి చెందడంతో ఈరోజుఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతుందని తెలిపారు. జనగామ నిరంజన్ కేవలం దళిత జర్నలిస్టు కావడం వల్లనే ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించడంలో స్థానిక ఎమ్మెల్యే మొదలుకొని రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు వివక్షత చూపిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే జనగామ నిరంజన్ కుటుంబాన్ని పరామర్శించడం తో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిరంజన్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరేల్లి మల్లేష్ మాట్లాడుతూ జనగామ నిరంజన్ కుటుంబానికి ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన కుటుంబానికి ఏదో విధంగా ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ అసోసియేషన్ తరపున పోరాటం చేస్తామని తెలిపారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల రాజశేఖర్ మాట్లాడుతూ జనగామ నిరంజన్ రాసిన వార్తలతో అనేకమంది నాయకులు వివిధ పార్టీలో పదవులు అనుభవిస్తున్నారని వారంతా స్పందించి నిరంజన్ కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జనగామ నిరంజన్ కుటుంబాన్ని ఆదుకునేందుకు పదిలక్షల ఆర్థిక సహాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మొలగూరి కమల్, దుర్గం నగేష్, రాష్ట్ర నాయకులు కుమ్మరి ముఖేష్ పాల్గొన్నారు.
