ఈసీ ‘నో’ పర్మిషన్.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
ఈసీ ‘నో’ పర్మిషన్.. తెలంగాణ
కేబినెట్ భేటీ వాయిదా

హైదరాబాద్, మే 18 (విశ్వం న్యూస్) : తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఈరోజు(మే 18) సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం నిర్వహించాలని భావించారు. ఈ సమావేశం నిర్వహణకు అవకాశం ఇవ్వాలంటూ రెండు రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇక, తెలంగాణలో పోలింగ్ ముగిసినప్పటికీ.. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసి, ఫలితాలు వెలువడి, మొత్తం ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండనున్న సంగతి తెలిసిందే.
ఈరోజు సాయంత్రం వరకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో మంత్రివర్గం సమావేశం వాయిదా పడింది. ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో సీఎం, మంత్రులు సచివాలయం నుంచి వెళ్లిపోయారు. ఈసీ నుంచి అనుమతి లభించిన తర్వాతే కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
అయితే సోమవారంలోగా ఈసీ అనుమతి ఇవ్వకపోతే.. కేబినెట్ సమావేశానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మంత్రులతో పాటు ఢిల్లీ వెళ్లి ఈసీ అధికారులను కలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
